రెండు నదులు

ISBN పబ్లిషర్స్

రెండు నదులు ఒక దేహం…

ఇద్దరం ఒకే గొడుగుక్రింద కూర్చుంటాం
రెండు సమాంతర నదులై ప్రవహిస్తాం
ఇద్దరి మధ్య ఒక కలల ప్రపంచం ఆవిష్కారమైతుంది..
కొన్నిసార్లు మాటలేవి ఉండవు…మౌనం మా మధ్య పరిమళం లా వ్యాపిస్తుంది
కన్నులు లిపిలేని భాషను పలికిస్తున్నాయి
కన్నులతో ముచ్చట రాయని ప్రేమకావ్యమైతది…
తను దేహాన్ని విల్లుల వంచి ఆకాశం వైపు తొంగి చూస్తుంది..తనపిలుపును అందుకుని
ఒక మబ్బుల గుంపు మా మీద చినుకుల్ని గారబంగా రాల్చి వెళ్ళిపోతుంది…
మొహాభరితమైన కాంక్షల్ని చల్లార్చే ఉట్టి తనువుకాదు తను..
నన్ను నదిని చేసి తనో పడవై జీవన గమ్యానికి తీసుకెల్లే మహాద్భుత కానుక
వేల సుందరాంగులు తన నలుపు సౌందర్యం ముందు వెలవెల పోతారు..
ఆమె కుడివైపు సౌందర్యంతో పోటీ ఎడమవైపు సౌందర్యమే…
ప్రబంధకన్నియల వర్ణణలరాసి పోసిన తనకు సాటి రారు…
ఆమే సాంగత్యంలో నేను పసిపిల్లడినైపోతాను…
ఆమే ఎదురుగా నేను ప్రేమ పిపాసినైపోతాను..
ఆమె చెంతన నేను బికారిగా నిలిచిన ఐశ్వర్యవంతున్నే!
ఆమె నీడ సోకినప్పుడల్లా చల్లదనాన్ని ఆస్వాదిస్తాను
నా జీవనకాంక్షల్ని నింపే మధుకలశం
“నువ్వుంటే ప్రపంచం నా చుట్టూ కుక్కపిల్లల తిరుగుతుంది-నువ్వు లేకుంటే నేను ప్రపంచం లో ఏకాకినై పోతాను” అన్నాను
తటిల్లతా క్షణంలో…
గొడుగును ఆకాశంలోకి విసిరేసి ..నేలరాలడానికి సిద్ధంగావున్న కన్నీటి పూలతో ముద్దీడి నన్ను తనలో కలిపేసుకుంది…
జీవన ప్రాంగణంలో రెండునదులమై ఒకేదేహమై స్వేచ్ఛవిహారం చేసాం
తను నిరంతరం నా గుండెలో కొట్టుకునేశ్వాస…. నేను తనకొక ఆనుక్షణికంలా మిగిలిపోయే ప్రేమ జ్వాల!!

Dr తుమ్మల దేవరావ్
8985742274

Get real time updates directly on you device, subscribe now.