“స్త్రీ స్థితి గతులు స్త్రీ ఉనికి ఒక పరిశీలన “

“స్త్రీ స్థితి గతులు స్త్రీ ఉనికి ఒక పరిశీలన ”

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః

యత్రైతాస్తు నపూజ్యంతే సర్వస్తత్రఫలా క్రియాః

“ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో
అక్కడ దేవతలు క్రీడిస్తారు, ఎక్కడ పూజింపబడరో అక్కడ క్రియలన్నీ నిష్ఫలం అవుతాయి” అనే భావాన్ని కలిగిన మను స్మృతి లోని ఈ శ్లోకాన్ని పరిశీలిస్తే పూజింపబడటం, గౌరవించబడటం అనే విషయాలను దేవతలకు పరిమితం చేస్తే స్త్రీని కనీసం మనిషిగా అయినా గుర్తిస్తున్నారా అంటే సమధానం తడుముకోవాల్సిన పరిస్థితి. మానవ పరిణామ క్రమంలో స్తీ, పురుషుల మధ్య ఉన్నది కేవలం లింగబేధం మాత్రమే. మానవులు ఆదిమ దశ నుండి నేటి నాగరికత దశ వరకు చేరుకోవడానికి జరిగిన ప్రతి ప్రయత్నంలో స్త్రీ పాత్ర అనన్యం. ఉత్పత్తిలో భాగస్వామ్యం, శ్రమలో భాగస్వామ్యం, ఆహార సంపాదనలో భాగస్వామ్యం… ఇలా జీవితపు అన్ని పార్శ్వాలలో స్త్రీ తన పాత్రను సమర్థవంతంగా పోషించింది. ఇప్పటికీ ఒక్క మానవ జాతిలో తప్ప మిగిలిన అన్ని పశు పక్ష్యాదులలో పురుషజాతి కన్నా స్త్రీజాతి ఎక్కువ సమర్ధతను, ఉత్పాదకతను ధైర్యాన్ని కలిగిఉన్నాయి.(Female of the species is more deadly than males). మానవజాతి మొదటిదశ లో సమానత్వం, స్వేచ్ఛ కలిగిన స్త్రీలు తదనంతర పరాణామాలతో వాటిని పోరాడి సాధించుకోవాల్సిన పరిస్థితిలోకి నెట్టి వేయబడ్డారు. దీనికి ఏ సమాజం కూడా అతీతం కాలేకపోయింది.(ప్రపంచంలో స్వేఛ్ఛా స్వాతంత్ర్యాలకు స్వర్గంగా భాసిల్లుతోన్న అమెరికాకు 200 సంవత్సరాల తర్వాత కూడా ఒక మహిళ అధ్యక్షురాలు కాలేకపోయింది.) స్వేచ్ఛ, సమానత్వం అంటే ఏమిటో తెలియని దశలో వాటిని పుష్కలంగా అనుభవించిన స్త్రీలు వాటి విలువ, రుచి తెలిసిన తరుణంలో వాటికి దూరం అవటం యాదృశ్చికమా? వ్యూహాత్మాకమా? లేక పరిణామాత్మాకమా?
పరిపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, స్వావలంబన నుండి పరిమిత స్వేచ్ఛ, అసమానత్వం, పరాధీనత వైపు మహిళలు చేసిన ప్రయాణమే సామాజిక పరిణామంగా చూడవచ్చు. ఈ పరిణామాలను విశ్లేషిస్తే మనకు కొన్ని కారణాలు కనిపించొచ్చు.

“పితా రక్షతి కౌమారే
భర్తా రక్షతి యౌవనే
రక్షంతి స్థావిరే పుత్రా
నస్త్రీ స్వాతంత్ర్యమర్హతి”

పై శ్లోకం ప్రకారం…

బాల్యమందు తండ్రి యవ్వనమందు భర్త వృద్దాప్యమందు కుమారుడు స్త్రీని రక్షించుదురు కావున “స్త్రీ” స్వతంత్రించరాదు.

స్త్రీని ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిగా కాక అస్థిత్వం లేని వస్తువుగాను, ఆస్తిగాను పరిగణించటం వలన తనను తాను రక్షించుకోలేదనే స్థిర నిర్ణయానికి వచ్చి స్త్రీ ఉనికిని, వర్తమానాన్ని, భవిష్యత్ ను పురుషునితో అనుసంధానింపచేసింది ఈ సాంప్రదాయం.

“తల్లి యధార్ధం,తండ్రి నమ్మకం”

అనే సార్వజనీన సత్యమైన ఈ భారతీయ తత్వాన్ని పరిశీలిస్తే స్త్రీ వ్యక్తిత్వాన్ని, సౌశీల్యాన్ని లీలగా ప్రశ్నించటం మనకు గోచరిస్తుంది. స్త్రీని గౌరవించాలి అని చెప్తున్న మన సంస్కృతి సంప్రదాయాలు ఆచరణలో అందుకు భిన్నమైన వాతావరణాన్ని సృష్టించాయి. భారతదేశంలో ఉన్న ఏ సంస్కృతి, సాంప్రదాయాలు దీనికి అతీతం కాలేకపోయాయి.

సృష్టి నిర్మాణ కార్యక్రమానికి అన్ని మతాలు తమ దేవుళ్ళే ఆధారం అని చెప్తున్నట్లుగానే, సమాజ పురోగతి, వికాసానికి పురుషులే ఆధారం అని అందరు భ్రమిస్తున్నారు.ఈ పురుషాధిక్య భావ వ్యాప్తికి అన్ని మతాలు శక్తివంచన లేకుండా కృషిచేశాయి. దీనికి ఏ మతం అతీతం కాదు. భారతీయులలో అత్యధికులు ఆచరిస్తున్న హిందూ మతపు పవిత్ర గ్రంధం ఋగ్వేదంలో పురుషులు శక్తిమంతులు, స్త్రీలు అబలలు అని చెప్పటం జరిగింది. హిందూ మతం స్త్రీలపట్ల భిన్నధోరణి అవలంబించింది. స్త్రీ ఆదిశక్తి, పరాశక్తి, శక్తి స్వరూపిణి అని కీర్తిస్తూనే “నస్త్రీ స్వాతంత్ర్య మర్హతి” అనటం దీనికి ఉదాహరణ. ప్రపంచంలో అత్యధిక ప్రజలు అరాధిస్తున్న, క్రైస్తవమతం స్త్రీ గురించి “స్త్రీ సంఘంలో మౌనంగా ఉండవలెను” ( 1కొరింథి 14:34), “స్త్రీని బలహీన ఘటముగా ఎంచవలెను” (1పేతురు 3:7) పై వాక్యాలను గమనిస్తే స్త్రీల పట్ల క్రైస్తవ్యం కొన్ని నిర్ధిష్టమైన అభిప్రాయాలను కలిగి ఉంది. ఇక ఇస్లాం విషయానికి వస్తే స్త్రీల కంటే పురుషులకు దేవుడు ఎక్కువ మంచి గుణాలు ఇచ్చిఉండుట చేత పురుషులు తమకు ప్రసాదింపబడిన దానితో ఎక్కువ ఆదాయం చేయగల్గుట చేతను స్త్రీల కంటే పురుషులు అధికమని చెప్పటం జరిగింది. అంటే మతాలన్నీ స్త్రీ పురుష వైవిధ్యానికి కారణం అవుతున్నాయి.

భారతీయ సమాజంలో పిల్లలను చిన్నప్పటి నుంచే స్వంత ఇంటిలోనే రెండు భిన్నమైన వాతవరణాలలొ తల్లిదండ్రులు పెంచుతున్నారు. నిశితంగా పరిశీలిస్తే మగపిల్లలు ఆడుకునే ఆటలు, ఆటల్లో ఉపయోగించే వస్తువులు, వస్త్రధారణ; ఆడపిల్లలు, వారు ఆడుకునే ఆటలు,ఆటల్లో ఉపయోగించే వస్తువులు, వస్త్రధారణ పురుషాధిక్యతకు దోహదం చేసేవిధంగా ఉన్నాయి. మగపిల్లలు తుపాకులు, రైళ్ళు, బస్సులు, హెలికాప్టర్, ట్రాక్టర్ వంటి వాటితో ఆడుకుంటే, ఆడపిల్లలు స్టవ్, గిన్నెలు, చెంబు, చేట, కంచాలు, బకెట్, గ్లాస్ వంటి గృహోపకరణాలతో ఆడుకోవటం చూడవచ్చు. అంటే మగపిల్లల ఆటలు పని ప్రపంచంలోకి ప్రవేశించటానికి వీలుగా ఉంటే, ఆడపిల్లల ఆటలు ఇంటిలో గృహావసరాలు తీర్చే గృహిణిగా తమను తాము మానసికంగా సిధ్దం చేసుకునే వాతవరణానికి అనుగుణంగా ఉన్నాయి. భవిష్యత్ లో తాము ఎలా ఉండాలనేది ఆటపాటల రూపంలో వారికి తెలియకుండానే వారి మస్తిష్కాలలో పురుషాధిక్య భావనను చొప్పిస్తున్నారు. ఇలాంటి సామాజికీకరణ నిరంతరాయంగా కొన్ని తరాలుగా కొనసాగుతుండంటం ఈ దుస్థితికి ఒక కారణమైంది. ఈ పరిస్థితులు మారనంత కాలం ఎన్ని మహిళా దినోత్సవాలు జరుపుకున్నా భారతదేశంలో మహిళలుకు ఒరిగేదేమీ ఉండదు.

“ఏది తెలుసుకుంటే సర్వం తెలుస్తుందో అదే విద్య”
౼౼శంకరాచార్య
అజ్ఞానాంధకారాన్ని పారద్రోలటానికి విద్య ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది. విద్య తార్కికతను, ప్రశ్నించే తత్వాన్ని కల్గిఉంది. అయితే భారతీయ మహిళ కొన్ని వందల సంవత్సరాలుగా కారణాలు ఏవైనా అవిద్యావంతురాలుగా ఉండటం వల్ల హేతుబద్దత, ప్రశ్నించేతత్వం అలవడలేదు. అందువల్ల స్త్రీ సంస్కృతి సాంప్రదాయాల పేరుతో కొనసాగుతున్న పురుషాధిపత్యాన్ని అంగీకరించింది. విద్య అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో మార్పు వస్తుందేమోనని చూస్తే, పురుషాధిపత్యం కూడా అంటరానితనం లాగే తన రూపాన్ని మార్చుకుందే గాని తీవ్రతను అలాగే కొనసాగిస్తుంది. కాలక్రమంలో స్త్రీకి విద్య అందుబాటులోకి వచ్చిన తర్వాత అనైష్పత్తికంగా నైనా గుణాత్మక మార్పు సంభవించింది. విద్యాభివృద్ధి,
శాస్త్ర సాంకేతికాభివృద్ధి ఫలితంగా ప్రపంచంలో పారిశ్రామికీకరణ ప్రవేశించింది.
మానవ సమాజ సాంకేతికతను, అభివృద్ధిని వేగవంతం చేసిన పారిశ్రామికీకరణ మానవ జీవితానికి ఎంతో సౌఖ్యాన్ని, అంతే స్థాయిలో సంక్లిష్టతను అందించింది. నగరీకరణ, కాలుష్యం, వలసలు, అత్యధిక లాభాపేక్ష ,పారిశ్రామికీకరణ ఫలితాలు. మహిళల జీవితాలపై ఇది చూపించిన పెనుప్రభావమే పాత్ర సంఘర్షణ(Role Conflict). అప్పటివరకు భార్యగా, అమ్మగా, కూతురిగా, సోదరిగా, కోడలిగా బహు పాత్రలను పోషించిన మహిళకు పారిశ్రామికీకరణ తదనంతర పరిణామాల వల్ల కొత్తగా “వర్కింగ్ ఉమన్” అనే అదనపు పాత్ర ఆమె జీవితంలో భాగమయ్యింది. రోజులో ఎక్కువ సమయం పనిలో గడపటం వల్ల చివరిగా వచ్చిన ఈ “వర్కింగ్ ఉమన్” పాత్ర ఇంతకు ముందు ఉన్న అన్ని పాత్రలను ప్రభావితం చేసి పాత్రల సంఘర్షణకు దారితీసేలా చేసింది. సరిగ్గా ఈ సమయంలోనే మహిళలు, హక్కులు అవకాశాలు గురించి మాట్లాడుకోవడం మొదలైంది. మహిళా దినోత్సవాలు ఈకాలంలోనే ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు అంతంత మాత్రంగా ఉన్న మహిళల పరిస్థితిని ప్రపంచీకరణ మరింతగా దిగజార్చింది. ప్రపంచీకరణను భుజానికెత్తుకొని మోస్తున్న బహుళజాతి కంపెనీలు తమ వ్యాపార విస్తరణలో భాగంగా మహిళలను “మోడల్స్” లా ఎంచుకుని వారి అనుమతితోనే వారిని అంగడి వస్తువులుగా మార్చడం చూస్తున్నాం. దీనికి కొనసాగింపుగా అందాలపోటీల పేరుతో కొనుగోలు శక్తి ఎక్కువగా గల దేశాల స్త్రీలకు ప్రపంచ సుందరి, విశ్వసుందరి లాంటి కిరీటాలను ప్రధానం చేస్తున్నాయి. భారతదేశంలో ప్రపంచీకరణ మొదలైన తొలి దశాబ్దంలో భారతీయ స్త్రీలు ఎక్కువసార్లు ఈ పోటిల్లో విజేతలవ్వటం దీనికి ఉదాహరణ. మహిళల ఆత్మగౌరవానికి వెల కట్టటం ప్రపంచీకరణ సాధించిన కుత్సిత విజయం.

మహిళా దినోత్సవం ౼ చారిత్రక నేపథ్యం.

స్త్రీలలో అశాంతి, పారిశ్రామిక సమాజాలలో స్త్రీ ఆర్ధిక దోపిడీ వంటి విషయాలకు వ్యతిరేకంగా 1908 లో 15,000 మంది స్త్రీలు న్యూయార్క్ పట్నంలో పనిగంటల తగ్గింపు, సరైన వేతనాలు, ఓటు హక్కు కోసం ఒక కవాతును నిర్వహించారు.1909వ సంవత్సరంలో అమెరికా సోషలిస్టు పార్టీ డిక్లరేషన్ ప్రకారం అమెరికా లోని అన్ని రాష్ట్రాలు ఫిబ్రవరి 28 ని మహిళా దినోత్సవంగా జరుపుకున్నాయి.1913 వరకు ఫిబ్రవరి చివరి ఆదివారాన్ని మహిళా దినోత్సవంగా జరుపుకున్నాయి.
1910 లో కోపెన్ హెగెన్ లో జరిగిన 2వ అంతర్జాతీయ మహిళా సదస్సు ( International Conference of Working Women ) లో సోషల్ డెమోక్రటిక్ పార్టీ (జర్మనీ)కి చెందిన “క్లారా జట్కిన్” ప్రతిదేశం ప్రతి సంవత్సరం ఒక రోజు మహిళల హక్కులకోసం పోరాడే దినంగా జరుపుకోవాలని చేసిన ప్రతిపాదనను 17 దేశాలకు చెందిన 100 మంది మహిళా ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించడం చేత అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి అంకురం ఏర్పడింది. కోపెన్ హెగెన్ లో తీసుకున్న ఈ నిర్ణయానికి అనుగుణంగా మొదటిసారి 1911 మార్చి 19 ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా డెన్మార్క్, ఆస్ట్రియా, జర్మనీ, స్విట్జర్లాండ్ లు ఆచరించాయి.1913లో మొదటి ప్రపంచయుధ్ద కాలంలో రష్యాలో మహిళలు శాంతికోసం చేస్తున్న ప్రచారంలో భాగంగా మహిళా దినోత్సవాన్ని మార్చి 8 కి మార్చడం జరిగింది. 1975 లో ఐక్యరాజ్య సమితి దీనిని అధికారికంగా గుర్తించింది.

మహిళలు౼ అభివృద్ధి ౼ప్రాధాన్యత.

ఏ సమాజ అభివృద్ధికైనా మహిళల భాగస్వామ్యం తప్పనిసరి. పారిశ్రామికంగా ఆర్ధికంగా, మానవాభివృద్ధి సూచికలో ముందంజలో ఉన్న దేశాల స్థూల జాతీయ ఉత్పత్తిలో మహిళల భాగస్వామ్యం గణనీయం. జనాభాలో 50% మహిళల మేధస్సును, శ్రమను విస్మరించడం అంటే అభివృద్ధిని ఆలస్యం చేయడమే. ప్రాథమిక పాఠశాలల్లో బాలికల ప్రవేశ నమోదు ఒక పర్సెంటైల్ పెరిగితే, ఆర్ధికాభివృద్ధి 0.3 శాతం పెరుగుదల సాధ్యమౌతుందని గణాంకాలు చెప్తున్నాయి. ఇది మొత్తం సమాజానికి లాభించే అంశం.1945 లో పూర్తిగా ధ్వంసం అయిన జపాన్ 1947,1950 లలో స్వాతంత్ర్యం సంపాదించుకున్న భారత, చైనాలు తమ ప్రస్థానాన్ని ఒకే కాలంలోప్రారంభించాయి. గడచిన 70 సంవత్సరాలలో చైనా,జపాన్ లు సాధించినంత అభివృద్ధి మనం సాధించలేకపోవటానికి ముఖ్యకారణం మన దేశంలో మహిళల భాగస్వామ్యం పరిమితంగా ఉండటం. ఈనాటికీ భారతదేశంలో బాలికలకు పోషకాహార లేమి ,అవిద్య, అభద్రత భారతీయ మహిళ పరిస్థితిని తెలియచేస్తుంది.

ప్రపంచంలో చాలా దేశాలలో అభివృద్ధి అంటే అంకెలతో ముడిపడి ఉన్న ఆర్ధిక, పారిశ్రామిక అభివృద్ధి మాత్రమే. మానవాభివృద్ధి, మహిళాభివృద్ధి అనేవి ఇంకా ప్రాధాన్యతకు నోచుకోని అంశాలు. గత 15 సంవత్సరాలుగా వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ “ప్రపంచ లింగ ఆధారిత అంతర సూచిక” (Global Gender Gap Index) ను ఆర్థిక భాగస్వామ్యం మరియు అవకాశాలు (Economic participation and opportunity), విద్యాసాధన ( Educational Attainment), ఆరోగ్యము మరియు మనుగడ ( Health and Survival), రాజకీయ సాధికారత (Political Empowerment), ల ప్రాతిపదికగా వార్షిక నివేదికలను ప్రచురిస్తూ ఉంది. ఇటీవలి 2020 నివేదిక ప్రకారం 153 దేశాలలో భారతదేశం, 2019 కంటే నాలుగు స్థానాలు దిగజారి 112వ స్థానంలో ఉంది. అలాగే అతి కీలకమైన “రాజకీయ సాధికారత” విషయంలో స్త్రీలు అత్యంత వివక్షని ఎదుర్కొంటున్నారు. ప్రపంచంలోని మొత్తం చట్టసభల ( 35,127) సీట్లలో కేవలం 25% , మొత్తం మంత్రుల (3343) లో 21% మాత్రమే మహిళలు ఉన్నారు. చట్టసభలలో సమాజానికి, మహిళలకు సంబంధించిన నిర్ణయాధికార విషయాలలో వీరి పాత్ర నామమాత్రం. మహిళల కోసం కేవలం నిధుల కేటాయింపు, పథకాల ప్రకటనలతోనో, ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలతోనో వివక్షలేని సమాజం సాధ్యం కాదు. వివక్ష లేని సామాజికీకరణ, ఆలోచనాధోరణి, జీవనవిధానం, ప్రజలలో మార్పుతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇప్పుడున్న పరిస్దితులు ఇలానే కొనసాగితే, లింగ ఆధారిత వివక్షలేని సమాజం ఏర్పడాలంటే ఇంకో 100 సంవత్సరాలు పడ్తుందని ఈ నివేదిక చెప్తుంది. ఇంత సుదీర్ఘకాలం ఆధునిక మహిళలు “శాంతియుతంగా” నిరీక్షిస్తారని ఆశించటం కూడా అత్యాశే! లింగ వివక్ష రహిత సమాజం కోసం మహిళలు ఇంకా 100 సంవత్సరాలు ఎదురు చూడటం ఏ సమాజానికైనా అంత మంచిది కాదేమో…..

డాక్టర్. శామ్యూల్ జాన్ ఆదూరి,
అసిస్టెంట్ ప్రొఫెసర్,
డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ,
ఆంధ్ర యూనివర్సిటి
8317563725.

Get real time updates directly on you device, subscribe now.