కాళోజీ యాదిలో

కాళోజి యాదిలో

కాళోజీ బాల్యం నుండి అధికారులు దౌర్జన్యాల మీద తిరుగుబాటు చేసే వారు. పాలకుల పీడక వర్తనాన్ని ధిక్కరించేవారు తెలంగాణ జనజీవన చారిత్రక గమనంలో అప్రమత్తమైన ప్రజలను ముందుకు నడిపించేవారు. కార్యాచరణే కవిత్వమై జీవితాన్నే కవిత్వీకరించుకున్నవాడు కాళోజీ. తన గొడవ పదుగురి గొడవ కావాలనుకొని ‘ప్రజల గొడవ’ను ‘నాగొడవ’ కావ్యంలో ప్రతిధ్వనించాడు. ఖలీల్ జిబ్రాన్ కవిత్వంలా తిరుగుబాటే జీవన బావుటాగా భావించి పురోగమించాడు.

“అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకుముక్తి ప్రాప్తి అన్యాయన్నెదిరించినోడు నాకు ఆరాధ్యుడు”

అన్యాయాన్నెదించడమే జీవిత లక్ష్యమైన కాళోజీ ఎన్నో ఉద్యమాలలో పాల్గొని కీలక పాత్రవహించాడు.

కాళోజీ నారాయణరావు రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాస్ రావు రామ్ రాజా కాలోజి నారాయణరావు ఈయన 1914 సెప్టెంబర్ 9వ తేదిన వరంగల్ సమీపంలోని మడికొండ గ్రామంలో అతిసాధారణ కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రకు చెందినవారు. ఆయన తల్లి రమాబాయి కర్నాటక రాష్ట్రానికి చెందినది. కాళోజీ ప్రాథమిక విద్య స్వగ్రామం అయిన మడికొండలో సాగింది. వరంగల్ హైదరాబాద్లలో ఉన్నత విద్యను పూర్తి చేసిన కాళోజీ 21 గ్రంథాలు రచించాడు. వాటిలో ”నాగొడవ’ ఆయనకెంతో కీర్తి ప్రతిష్టలు తెచ్చింది.ఉద్యమ స్ఫూర్తి – వ్యక్తిత్వ దీప్తి :

మాజీ ప్రధాని పి.వి. నరసింహరావు సన్నిహితమిత్రుడైన కాళోజీ ఆయనతోపాటు తెలంగాణా సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు సత్యాగ్రహ ఉద్యమం, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు సాగించిన వందేమాతర ఉద్యమం, ఆర్య సమాజ్, స్టేట్ కాంగ్రెస్, ఆంధ్రమహాసభ (తెలంగాణ) రజాకార్ల ఉద్యమాల్లో పాల్గొని మెప్పు పొందాడు. తన వ్యక్తిత్వానికి దీప్తిని కలిగించుకున్నాడు 1958 నుండి 1960 వరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడిగా కొనసాగాడు. 1977లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుపై పోటీ చేసి ఓడిపోయాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీల్లో సభ్యుడిగా కొనసాగాడు. తెలంగాణా రచయితల సంఘం అధ్యక్షుడిగా పనిచేశాడు.

సత్కారాలు – పురస్కారాలు :

1968లో ఆయన రచించిన ‘జీవనగీత’కు రాష్ట్రప్రభుత్వ వారి ఉత్తమ అనువాదరచన కు అవార్డు లభించింది. బూర్గుల రామకృష్ణారావు మొదటి ప్రపంచ మహాసభలల్లో (1975) రాష్ట్ర ప్రభుత్వ సత్కారం అందుకున్నాడు. 1992లో భారత ప్రభుత్వం కాళోజీ సాహితీ వ్యక్తిత్వాన్ని కవితా ప్రతిభను గుర్తించి పద్మవిభూషణ పురస్కారంతో సత్కరించింది. అదే ఏడాది కాకతీయ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ను అందుకున్నాడు. 1996లో మద్రాస్ కళాసాగర్ విశిష్ట పురస్కారాన్ని స్వీకరించాడు. 2000 సంవత్సరంలో రామినేని ఫౌండేషన్ అవార్డును అందుకున్నాడు. 89 సంవత్సరాల వయస్సులో కాళోజీ అనారోగ్యంతో “కన్నుమూశారు మాజీ ప్రధాని పి.వి. నరసింహరావు మొదలు ప్రముఖులెందరో ఆయనకు మననివాళి అర్పించారు.కాళోజీ గొప్ప మానవతావాది. ఆయన హృదయం కరుణరసార్ధం. ఆయనత ఒక సంస్కర్త, ఒక ఉద్యమకారుడు, సాహితీవేత్త వంటి భిన్న పార్శ్వాలు కనిపిస్తాయి.

కాళోజీ లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ గురించి రాసిన ఈ పంక్తులు కాళోజీ జీవితానికి వర్తిస్తాయి.

“పుట్టుక నీది చావు నీది – బతుకంతా దేశానిది”

తన జీవితకాలంలో పుట్టిన అన్ని ఉద్యమాలతో మమేకమై పోరాడిన మహోన్నత వ్యక్తి కాళోజీ, గణపతి ఉత్సవాలు, గ్రంథాలయ ఉద్యమం, ఆర్యసమాజ కార్యక్రమాలు, రజాకార్ల ప్రతిఘటన, స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహాలు, ఆంధ్రమహాసభలు, తెలంగాణ రైతాంగ పోరాటం, విశాలాంధ్ర ఉద్యమం, రెండు తెలంగాణ ఉద్యమాలు, అత్యవసర పరిస్థితి వ్యతిరేక పోరాటం, పౌరహక్కుల పోరాటం మొదలైన అన్ని ఉద్యమాలకు స్పందించిన నిత్య సమరశీలి కాళోజీ… ఏ సిద్ధాంత చట్రంలోనూ ఇమడక, ఏ యిజాన్ని భుజానికెత్తుకోక ప్రజల సమస్యలపైనే పోరాడిన అలుపెరగని కలం యోధుడాయన. ఏడున్నర దశాబ్దాలు ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల పక్షాన గొంతెత్తి కార్యాచరణే కవిత్వమై జీవితాన్ని కవిత్వీకరించుకున్నారు.

కాళోజీ భావజాలంలోగాని, ఆచరణలోగాని, ప్రధానంగా కనిపించేది వ్యక్తి స్వేచ్ఛ. అదే ఆయనను ధిక్కార కవిగా, ఉద్యమకారుడిగా చేసింది. నిజాంకాలంలోని అణచివేత ధోరణులు ఆయనలోని స్వేచ్ఛావాదాన్ని బలోపేతం చేశాయి. వ్యక్తి స్వేచ్ఛకు సంబంధి కాళోజీలో ఒక వోల్టేరు, ఒక రూసో కనిపిస్తారు.

కాళోజీ రాజకీయ జీవితం ఆర్యసమాజంలోనే ఆరంభం అయింది. ఆయన గాంధేయవాది. ‘అహింస గొప్పదే కాని నేను పిరికితనం కన్నా హింసనే సమర్ధిస్తాను” అన్న గాంధీజీ సూక్తి ఆ కలాన్ని ఆయుధం చేసింది. భాగవతంలోని ప్రహ్లాదుడి కథ ఆయనకు స్ఫూర్తిదాయకం. ప్రహ్లాదుని శాంతియుద్ధం హిరణ్య కశిపుణ్ణి మార్చలేదు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి హింసిస్తే, నరసింహ్మస్వామి హిరణ్యకశిపుణ్ణి అణచివేస్తాడు. అని కాళోజీ అనేక సందర్భాలలో ఉదహరించారు.”అధికారం ఉన్నవాడే అన్యాయం చేస్తుంటే, అదుపులో పెట్టే రాజ్యం ఆసరాగా వెనకుంటే – ప్రతి హింసకు పూనుకున్న ప్రతి నరుడూ నరసింహుడే” అంటారు కాళోజీగారు. హింస ప్రతిహింసకు దారి తీస్తుందన్న మావో మాటల్ని ఈ విధంగా కాళోజీ సమర్ధించారు.

1992లో కేంద్రం ఆయనను “పద్మ విభూషణ్” పురస్కారంతో సత్కరించింది. భారత ప్రభుత్వం ఇచ్చిన ప్రతిష్టాకరమైన “పద్మవిభూషణ్” బిరుదు కన్నా “ప్రజాకవి” బిరుదే తనిష్టపడతాను అంటారు కాళోజీ. ఆయన ప్రజాస్వామ్యకవి. నడుస్తున్న ఉద్యమాలను సజీవంగా వ్యాఖ్యానించిన కవితలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి.

నడుస్తున్న చరిత్రనే కాళోజీ ‘నా గొడవ’గా వినిపించారు. నా గొడవ తదితర రచనలతో తెలంగాణ ప్రజలను జాగృతం చేశారు. అన్నింటిలో ‘నాగొడవ’ బాగా ప్రాముఖ్యం పొందింది.

‘నా గొడవ’ అనగా అది ప్రజల గొడవ. దరిద్ర నారాయణుల సంవేదనా సంభరిత కావ్యేతిహాసం “నాగొడవ”

కాళోజీ ఏ సాహిత్యోద్యమంతోనూ ప్రభావితులు కాలేదు. తెలుగు సాహిత్యంలో విస్తరించిన వివిద కవితా ధోరణులు ఆయనపై ప్రభావం ప్రసరించలేదు. కవిత్వం కవిత్వం కోసం కాక సామాజిక ప్రయోజనం కోసం రాశాడాయన. కాళోజీ పీడితుల కోసం పరితపించాడు. పాలకుల దుర్నీతిని ఎండకట్టాడు. సమాజంలో ఎక్కడ ఎవరికి ఏబాధ కలిగినా అది తన బాధగానే భావించి ఆయన తన ఆవేదనను కవిత్వంలో ప్రతిఫలింపజేశారు.

కాళోజీ కవిత్వం అన్యాయంపై అక్షరాయుధం “అన్యాయాన్ని ఎదిరిస్తే నాగొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నాగొడవకు ముక్తిప్రాప్తి అన్యాయాన్నెదిరించినోడు నాకు ఆరాధ్యుడు”

అంటూ అన్యాయం ఎక్కడున్నా తన కలంతో దుర్మార్గాన్ని చెండాడాడు. నిత్య జీవితంలో ఎక్కడా ఆయన రాజీపడలేదు. కాళోజీ కవిత్వం చదువుతున్నప్పుడు ఒక వేమన, ఒక లూయీ ఆరగాన్, ఒక ఖలీల్ జిబ్రాన్ గుర్తుకొస్తారు. ఎందుకంటే ఆయన కవిత్వంలో ఉన్నవి నిప్పులాంటి నిజాలు ఆయన తిరుగుబాటు కవి, నిరసనకవి.”బతుకమ్మా బతుకు బతుకు బతికి బతుకుల బతికిస్తూ బతుకు” బతుకు, బతకనివ్వు అన్న తాత్విక దృక్పథం కాళోజీది. అదే ఆయనను ఉద్యమ కవిని చేసింది. ఆయనవి తీవ్ర ప్రజస్వామిక భావాలు. “ప్రజాస్వామ్యమంటే ఏమిటి ప్రజారాజ్యమంటే ఏమిటి సౌజన్యాలకు రక్ష సామరస్యాలకు రక్ష సహజీవనానికి రక్ష”

అన్న ఈ కవి ఎమర్జెన్సీలో “పౌరునిగ పలుకలేనప్పుడు బతుకెందుకని తనని తాను ప్రశ్నించుకుంటాడు. “ఓటిచ్చినప్పుడే ఉండాలె బుద్ధి’ అంటూ ఈ కవి

“పురుషులెవ్వారు కాపురుషులెవ్వారు గుర్తించి ఓటులను కురిపించవలయు ప్రాణతుల్యము ప్రజాస్వామ్యమున ఓటు” అంటారు “అన్నపురాశులు ఒకచోట ఆకలి మంటలు ఒక చోట హంస తూలికలు ఒక చోట అలసిన దేహాలు ఒక చోట”

ఈ విధంగా అవకాశాలకు అవసరాలకు మధ్య వైరుధ్యాలను, వ్యత్యాసాలను ఉదాహరణలతో, ఉపమానాలతో చెపుతారు. ప్రజాస్వామిక హక్కుల చైతన్యంలో భాగంగానే కాళోజీ ఆత్మగౌరవ చైతన్యాన్ని ప్రదర్శించారు.

కాళోజీ అచ్చమైన తెలంగాణ ప్రజాకవి. ప్రాంతీయ వివక్షకు వ్యతిరేకంగా గొంతెత్తి ప్రత్యేక తెలంగాణ కోసం నినదించారు. కాళోజీ తెలంగాణ అస్తిత్వ చైతన్య మూర్తి ఆయన కవిత్వాన్ని ఒక శతాబ్దపు కాలపు తెలంగాణ సామాజిక రాజకీయ చిత్రణగా చెప్పవచ్చును.

కాళోజీ “ప్రజాకీయాలు” అనే పదం సృష్టించారు. ప్రజాస్వామ్య పాలనలో పాలకులు ప్రజలకు జవాబుదారిగా ఉండాలంటారు. “ప్రజాస్వామ్య” జీవనాడి పట్టు తప్పలేదు కదా, అనవరతము జాగరణ అనివార్యం ప్రజలకును. ప్రజాస్వామ్య మూలమంత్ర పాఠమేల మరచెను ప్రజ? అని హెచ్చరిస్తారు.”నేను నీతో ఏకీభవించకపోయినా నాతో విభేదించడం నీహక్కుగా నేను “సమర్ధిస్తాను” అన్న అచ్చమైన ప్రజాస్వామ్యవాది కాళోజీ, ఆయన కవిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని ‘్న వేరుచేసి చూడలేం.

“అవనిపై జరిగేది అవకతవకలు చూసి ఎందుకో నాహృదిని ఇన్ని ఆవేదనలు పరుల కష్టము చూసి కరిగిపోవును గుండె మాయా మోసం జూచి మండిపోవును ఒళ్ళు” అని ఆవేదన చెందడంలో ఆయన సహజ స్వభావం ద్యోతకమౌతుంది.

మనిషికై పోరాటం- కాళోజీకి మాతృదేశమన్నా, మాతృభాష అన్నా అమితమైన అభిమానం. ఈ రోజుల్లో నిత్య వ్యవహారానికి తెలుగుకు బదులు ఆంగ్లం రాజ్యమేలుతోంది. నిజాం పాలనలో ఉర్దూ రాజ్యమేలింది. తెలుగువారు తమకు తెలుగురాదంటూ ఇతర భాషల్లో ప్రసంగించడం గర్వంగా భావిస్తున్నారు. ఈ దురవస్థను చూసిన కాళోజీ

“అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు, సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా” అని ఈసడించారు. భావదాస్యాన్ని ఎండగట్టాడు.

భాష విషయంలో ఆయనది విశాల దృక్పధం. తెలుగు భాషలోని అన్ని భేదాలను కలుపుకొని భాషను సుసంపన్నం చేసుకోవాలని అభిలషించారు. ఉచ్చారణ భేదాలను, యాసలను ఈసడించుకోవద్దన్నారు. ఎవరివాడుక భాషలో వారు రాయాలి అన్నదే కాళోజీ సిద్ధాంతం. తన బాషా శైలిలో తెలుగుదనాన్ని జన సామాన్యానికి అర్థమయ్యే పలుకబడిని అందులోనూ తెలంగాణ యాసను బహుళార్థ సాధకంగా పలుకుతారాయన. మనం చెప్పాలనుకున్నది ఎవరిని ఉద్దేశించిందో వాళ్ళకు చేరుతున్నదా లేదా? అన్నదే ముఖ్యమంటారు కాళోజీ.

చెంగా

కాళోజే ఆశావాది

“ఉదయం కానే కాదనుకోవడం నిరాశ ఉదయించి అట్లానే ఉండాలనుకోవడం దురాశ’ అని ఆయన సందేశం. “నేను ప్రస్తుతానికి – గతానికి శిఖరాన్ని వర్తమానాన్ని – భావికి ఆధారాన్ని నిన్నటి స్వప్నాన్ని – రేపటి జ్ఞాపికను”

ఖలీల్ జిబ్రాన్ వ్యాఖ్యలకు అను సృజనమైన ఈమాటల్లో కాళోజీ స్వీయ తాత్వికతవెల్లడవుతుంది. ప్రతి కొత్త భావంలోని మంచిని స్వీకరిస్తూ వచ్చిన విశ్వప్రేమికుడు, ఆదర్శవాది కాళోజీ. ఆయన మనస్సున్న మనిషిగా జీవించారు. మనిషికై పోరాడారు. మనిషికోసం కవిత్వం రాశారు.నా సాహిత్య జీవితమైనా, రాజకీయ జీవితమైనా, సాంఘిక జీవితమైనా పార్టీ ప్రత్యాలు లేకుండ గడిచింది, కాబట్టే ఏ రంగంలనైనా నన్ను ప్రత్యేకించి అభిమానించేటీ వాండ్లున్నరు. అయినా ఏమాటకు ఆ మాటే. ఎవరిదైతేనేం ఏ మాటకు ఆమాటే. ఆ మాటను బట్టి, వాండ్ల చర్యలను బట్టి వాండ్లను మెచ్చుకునుడైనా నిరసించుడైనా జరుగుతది. అంతేగాని నాకు ఏ కట్టు బాట్లు లేవు. ఇన్నాళ్ళు ఇట్ల సాగింది. ‘నాగొడవ’ సాగుతనే వున్నది. సాగుతనే వుంటది. కాళోజి తన 88వ ఏట 2002 నవంబర్ 13న కన్నుమూశాడు.

డాక్టర్ మాతంగి జానయ్య తెలుగు అధ్యాపకులు మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల డిగ్రీ కళాశాల, నాగార్జున సాగర్, నల్లగొండ జిల్లా 9640811664

Get real time updates directly on you device, subscribe now.