క్రీస్తు పుట్టిన రోజు…కరుణ కురిసిన రోజు / కొల్లాబత్తుల సూర్య కుమార్

క్రీస్తు పుట్టిన రోజు...కరుణ కురిసిన రోజు

*క్రీస్తు పుట్టిన రోజు…కరుణ కురిసిన రోజు*

యేసు క్రీస్తు పేరు వినని వారుండరు.సర్వమానవాళిని వారి పాపముల నుండి రక్షించుటకై దైవకుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ వలన కన్యకయైన మరియ గర్భమున మానవ రూపంలో భువిపై యేసు జన్మించినాడు. మరియ,యోసేపుల ఆలనా పాలనలో పెరిగి పెద్దవాడయ్యాడు. యేసు చిన్న వయసులోనే సిరియా,హిబ్రూ భాషలలోని మతగ్రంథములన్నిటినీ క్షుణ్ణంగా పఠించడం జరిగింది.యేసు జన్మించిన పాలస్తీనా దేశములో ఆనాడు మతము పేరిట అనేక అక్రమాలు జరిగేవి. వాటిని వ్యతిరేకిస్తూ శాంతి, ప్రేమ,సహనము,చేసిన తప్పులకు పశ్చాత్తాపపడి నడవడికను చక్కదిద్దుకొనుటను ప్రభోధించటం, జనుల మధ్య అనేక మహత్కార్యాలను చేయుట జరిగింది.యేసు మూడున్నర సంవత్సరముల పాటు బోధ జరిపెను.స్వల్ప కాలములోనే శిష్యబృందం,అనుచరగణం ఏర్పడడం, బోధలు ఆనాటి మతాధిపతులను తీవ్రమైన వేదనకు గురిచేయడంతో యేసుపై ద్వేషాన్ని పెంచుకుని ఎలాగైనా యేసుని అంతమొందించాలని తలంచి యేసుని మతవిరోధిగా చిత్రించి,దుర్భాషలతో, అతి కౄరంగా కొరడాలతో కొడుతూ,తలపై ముళ్ళకిరీటమును పెట్టి,అరచేతులలోను, పాదములలోనూ ఇనుప మేకులు కొట్టి,బహిరంగంగా శిలువ శిక్షను విధించి శిక్షించి సమాధి చేశారు.అయితే యేసు మరణమును జయించి మూడవ దినమున సమాధి నుండి లేచి శిష్యులకు మరికొంతమందికి కనిపించి పరలోకమునకు ఆరోహణుడవటం జరిగినది.
దైవ కుమారుడైన యేసు జన్మించిన రోజుని యావత్ ప్రపంచంలోని క్రైస్తవులందరూ క్రిస్మస్ రోజుగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఈ పండుగ ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 25వ తారీఖున జరుపుకుంటారు. మానవుల మధ్య ప్రేమ మెరిసిన రోజు…ప్రపంచమంతా కరుణ కురిసిన రోజు…దయామయుడైన యేసు ప్రభువు మానవ శరీరధారియై జన్మించిన రోజున క్రిస్మస్ పండుగ అంటారు.క్రైస్తవులకు క్రిస్మస్ మూడు రోజులు పండుగ.అవి 1.క్రిస్మస్ ఈవ్/సంధ్యా క్రిస్మస్,2.క్రిస్మస్,3.బాక్సింగ్ డే గా జరుపుకుంటారు.
1.క్రిస్మస్ ఈవ్/సంధ్యా క్రిస్మస్:-ఇది క్రిస్మస్ కి ముందు రోజున జరుపు కుంటారు. ఈ రోజున క్రైస్తవ సోదరులు క్రీస్తు జననంని తెలియపరిచే కీర్తనలు పాడుతూ, నినాదములను ఆలపిస్తూ… కేరల్స్ గా ఏర్పడి క్రొవొత్తులను చేతపట్టుకుని ప్రదర్శన చేస్తూ క్రీస్తు జనన శుభవార్తను చాటుతారు.
2. క్రిస్మస్:- ఈ రోజు దైవోపదేశకుల క్రీస్మస్ సందేశంతో పాటు ప్రముఖుల గ్రీటింగ్స్,మరియు చిన్న పిల్లలు మొదలు వృద్ధుల వరకూ ఒక్కొక్కరిగా చెప్పే యేసు జనన ప్రవచనములు.యేసు జననంని గూర్చిన ఏకపాత్రాభినయాలు,నాటికలు,నృత్యాలు, తోటివారికి బహుమతులనిచ్చే క్రిస్మస్ తాత(శాంతా క్లాజ్) వేషధారణలు, దైవ కీర్తనలతో ఆధ్యాత్మికంగా దైవారాధనలో యేసుని స్తుతించడం జరుగుతుంది.
3.బాక్సింగ్ డే:- ఇది క్రిస్మస్ తరువాతి రోజు.బెత్లహేములో పుట్టిన యేసు బాలుని చూడడానికై వచ్చిన ముగ్గురు జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోళములను కానుకలుగా సమర్పించుకున్నారు.ఇదే ఆచారాన్ని నేటి క్రైస్తవ సోదరులు క్రిస్మస్ రోజున బహుమతులను ఇచ్చి పుచ్చుకోవడం సంప్రదాయంగా వస్తుంది.అయితే క్రిస్మస్ రోజు దైవారాధనలో ఉండుట వల్ల మరుసటి రోజున ఆ బహుమతులను తెరిచి చూసుకుని ఆనందిస్తారు.ఈ రోజున కూడా దైవ ధ్యానంలో గడుపుతారు.తమకు బహుమతులను ఇచ్చిన వారి కొరకు ప్రార్ధిస్తారు.
ఈవిధంగా క్రైస్తవులు మూడు రోజుల క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు.డిసెంబరు నెల ప్రారంభం నుండే క్రీస్తు దేవాలయాలపై, గృహములపైన వివిధ రంగులతో ఉండు నక్షత్రము(స్టార్), విద్యుద్దీపాలతో అలంకరించబడిన క్రిస్మస్ ట్రీ, బాలయేసుని పరుండబెట్టిన పశువుల మేత తొట్టె(క్రిబ్),పశువుల పాక నమూనాలను తయారుచేసి సుందరంగా తీర్చిదిద్దుతారు.

కొల్లాబత్తుల సూర్య కుమార్.

Get real time updates directly on you device, subscribe now.