అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం

K surya kumar

*అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం*

1953 అక్టోబరు 1వ తేదీకి పూర్వం భారత దేశ పటంలో ఆంధ్ర రాష్ట్రం లేదు.ఆంధ్ర రాష్ట్ర భాగం మద్రాసు, కర్ణాటక, మహారాష్ట్ర మొదలైన రాష్ట్రాలతో కలిసి మద్రాసు రాష్ట్రంగా ఉండేది.ఆంధ్రుల ఆత్మాభిమానం కోసం,ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడిన వారిలో అగ్రగణ్యులు పొట్టి శ్రీరాములు.పొట్టి శ్రీరాములు కన్నా ముందు 1913 లో దేశభక్త కొండా వెంకటప్పయ్య గారు తెలుగు ప్రాంతానికో ప్రత్యేక రాష్ట్రప్రతిపత్తి అవసరమంటూ ‘ఆంధ్రకేసరి’ పత్రికలో ఒక వ్యాసం రాశారు.1913లో మొదటి ఆంధ్ర మహాసభ బాపట్లలోను,రెండో మహాసభ బెజవాడలోను, మూడవ మహాసభ 1914లో విశాఖపట్నంలోను జరిగాయి.ఈ సభల్లో తక్షణమే ఆంధ్ర రాష్ట్రం కావాలని తీర్మానించారు.ఆంధ్ర రాష్ట్రం కోసం గొల్లపూడి సీతారామశాస్త్రి గారు ఆమరణ దీక్ష ప్రారంభించగా నెహ్రూ వినోబాబావేల సలహాలతో మధ్యలోనే దీక్ష విరమించారు.
1901 మార్చి 16వ తేదీన మద్రాసులోని అణ్ణాపిళ్ళై, జార్జి టౌన్ లో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు పొట్టి శ్రీరాములు జన్మించారు.శానిటరీ ఇంజనీరింగ్ పూర్తి చేసి బొంబాయిలో రైల్వేశాఖలో ఉద్యోగం చేస్తుండగా గాంధీజీ పిలుపుననుసరించి సబర్మతీ ఆశ్రమానికెళ్ళి గాంధీజీకి ప్రియ శిష్యుడయ్యాడు. స్వాతంత్రోద్యమంలో గాంధీజీ నాయకత్వంలో దేశం కోసం పోరాడుతూనే, తెలుగు ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ పట్టుబట్టారు. స్వాతంత్రం వచ్చిన వెంటనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న విన్నపాన్ని ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.1952 అక్టోబరు 19వ తేదీన ఆంధ్రరాష్ట్ర ఆశయ సాధన కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడిన పొట్టి శ్రీరాములు గారు బులుసు సాంబమూర్తి గారి గృహంలో నిరాహారదీక్ష ప్రారంభించారు.1952 డిసెంబరు 5వ తేదీ నాటికి శ్రీరాములు ఆరోగ్య పరిస్థితి విషమించింది.ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సమస్యను పరిశీలించగలమని దీక్ష విరమించాలని కోరుతూ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1952 డిసెంబరు 9వ తేదీన శ్రీరాములుకి టెలిగ్రాం పంపారు.అయితే ఆ మాటలను శ్రీరాములు విశ్వసించలేదు. ఆంధ్రరాష్ట్ర సాధనే అంతిమ లక్ష్యంగా దీక్షను కొనసాగించి 1952 డిసెంబరు15వ తేదీ రాత్రి గం.9-45ని.లకు తనువు చాలించారు.పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ఫలితంగానే 1953 అక్టోబరు1వ తేదీనకర్నూలు తాత్కాలిక రాజధానిగా, తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.1956 నవంబరు1వ తేదీన తెలంగాణాతో కలిపి సువిశాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా హైదరాబాద్ రాజధానిగా అవతరించింది.

-కొల్లాబత్తుల సూర్య కుమార్

Get real time updates directly on you device, subscribe now.