పరిమళాల మధుభాష

నాశబోయిన నరసింహ రచన

*పరిమళాల మధుభాష*
“”””””””””””””””””””””””””””””””””
తేనీయల జలపాతం తెలుగు పదం
వీనుల విందైన సుస్వరాల రస తరంగం
పసిడి వన్నెల పలుకుబడుల క్షీర సాగరం
సంస్కృతీ సంప్రదాయాల సుమధుర భాషణం

సంగీత సాహిత్య సుగంధ పరిమళ భరితం
ఒంపు సొంపుల వయ్యారం గుండ్రటి నుడికారం
ద్రావిడ భాషా కళామతల్లి గారాల పుత్రికా రత్నం
సరళ సుకుమార సౌందర్య తెలుగువాణి నామధేయం

మాతృ భాషాభిమాన గౌరవం మన ధర్మం
జీవిత సత్యాల నైతిక విలువల నైవేద్యం
సృజనాత్మకత పెంచే మాతృ భాష ఔన్నత్యం
గద్య కావ్య శతక పద్య నీతి సూక్తుల విశిష్టసారం

పలు భాషల పదకోశ భూషణాల సమ్మేళనం
ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా కీర్తి కిరీటం
అలంకార ఛందోబద్ధ అక్షర మకరందం
తరగని తెలుగు వెలుగు భావితరాల కందిద్దాం

కవితారస కీర్తనల పాటల పూదోటమయం
గ్రహణ సామర్ధ్య మేధో మథనం వేగవంతం
దేశభాష లందు తెలుగులెస్సని గుర్తించిన వైనం
తల్లిభాష యధార్థ భావప్రేరేపణ సులువైన మార్గం

మమకారపు మాతృభాషకు పట్టాభిషేకం జరగాలి
పాలితుల ఉత్తర్వులు కోర్టు తీర్పులు తెలుగుండాలి
శాస్త్ర సాంకేతిక గ్రంథాలు తెలుగు అనువదించాలి
తెలుగు భాషా పరిమళాలు దశదిశలా వ్యాపించాలి

(21ఫిబ్రవరి,అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలతో..)

రచన: కవిరత్న నాశబోయిన నరసింహ (నాన),NVBDCP సబ్ యూనిట్ సికింద్రాబాద్, 8555010108.

Get real time updates directly on you device, subscribe now.