*సాహితీ సమరాంగణ సార్వభౌములు*
భారతదేశం పై బ్రిటీష్ వారి ఆధిపత్యాని కంటే ముందు సువిశాల ప్రాంతాన్ని అనేక రాజ వంశాలు పరిపాలించాయి. ఆయా పాలకులు తమ కౌశలాలతో సువిశాల సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకొని పాలన కొనసాగించడంతో పాటు గోప్ప సాహితీ పోషకులుగా కూడ పేరుగాంచారు. గోప్ప సాహితీ పోషకులే గాక స్వయంగా కవి పాత్రను సహితం పోషించి అనేక రచనలు చేసిన సాహితీ సమరాంగణ సార్వభౌములెందరో గలరు. వారిలో పేర్కొనదగిన వారు శాతవాహన వంశ రాజుల్లో 17వ రాజు హాలుడు రాచకొండ రాజుల్లో చివరివాడు మూడవ సింగమ నాయుడు, కాకతీయ పాలకుడు రుద్రదేవుడు, వాకాటకరాజు సర్వసేనుడు,కుతుబ్ షాహీ వంశ ప్రభువు మహ్మద్ కులీ కుతుబ్ షా విజయ నగర రాజు శ్రీకృష్ణ దేవరాయలు మొదలయిన వారెందరో గలరు.
భారతదేశ చరిత్రలో మౌర్య వంశ స్థాపన ఒక నూతన శకానికి నాంది పలికింది. వీరి పాలనా కాలంలో ఏకరూప పరిపాలనా వ్యవస్థ ఏర్పడినది. వీరి అనంతరం ఉత్తర భారతదేశంలో కుషాణులు, పల్లవులు దక్షిణ భారతదేశంలో శాతవాహనులు పాలన కొనసాగించారు.
దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన ఘనత శాతవాహనులకు దక్కుతుంది. దక్షిణ భారతదేశంలో విశాల సామ్రాజ్యాన్ని స్థాపించి రాజకీయ సమైక్యతను సాధించిన వీరి కాలంలో సాహిత్య, శిల్ప కళలకు రాజాదరణ లభించింది. శాతవాహన యుగంలో ప్రాకృతం, పాళీ, సంస్కృత భాషల్లో అపార సాహిత్యం వెలువడింది. వీరి రాజభాష ప్రాకృతం. ఇది తెలుగు భాషను ప్రభావితం చేసింది. వీరి కాలంలో హాలుడు పరిపాలించినది కొద్ది కాలమే అయిన ఇతని కీర్తి అజరామరమైనది. ఇతడు స్వయంగా కవి, సాహితీవేత్త, అనేక మంది కవులను పోషించి “కవివత్సలుడు” అనే బిరుదు పొందాడు. ఇతడు 700 ప్రాకృత పద్యాలతో “గాథా సప్తశతి”ని సంకలనం చేశారు దీనిని ప్రాకృతంలో ‘గాహా సత్తసయి’ అని అంటారు. దీనిలో ఆనాటి సామాన్య జనజీవితం సుఖ దుఃఖాలు, కష్ట సుఖాలు గాధలుగా చిత్రీకరించాడు. గాథలంటే పద్యాలు. ఈ పద్యాలలో అనేక తెలుగు పదాలు ఉన్నాయి. ఉదాహరణకు అత్తం,అమ్మి, అందం, అద్దం, పొట్టి, పాడి మొదలగునవి. గాథాసప్తశతి రచనకు తోడ్పడిన వారిలో అణులక్ష్మీ, అనుపలబ్ద, రేవ, మాధవి మొదలయిన స్ర్తీలున్నారు. వాకాటక రాజు సర్వసేనుడు హరివిజయం అనే ప్రాకృత కావ్యాన్ని రాశారు. ఈ కావ్యాన్ని దండి ప్రశంసించాడు. ఈ కావ్యంలో శ్రీకృష్ణుడు స్వర్గం నుంచి పారిజాతం చెట్టును తెచ్చే గాథను వివరించాడు. ఈ గ్రంథం అలభ్యం అయినప్పటికీ తరువాత రచయితలు తమ రచనల్లో హరివిజయంలోని విషయాలను పేర్కొన్నారు. రాష్ట్రకూట రాజు అమోఘవర్షుడు కన్నడ భాషలో మొదటి అలంకార గ్రంథమైన కవిరాజమార్గంను రచించాడు. ఇతను ప్రశ్నోత్తర రత్నమాలిక అనే నీతికావ్యం కూడా రచించాడు. వీరికి కవిరాజు అనే బిరుదు కలదు. రాష్ట్రకూటుల అనంతరం దక్షిణాపథం పై కళ్యాణి చాళుక్యులు ఆధిపత్యం వహించారు. ఈ వంశంలో మూడవ సోమేశ్వరుడు (భూలోక మల్ల) మానసోల్లాసము అను పేరుగల అభిలషితార్థ చింతామణి అనే గ్రంధాన్ని రచించాడు.
శాతవాహనుల అనంతరం దక్షిణ భారత దేశంలో పల్లవులు కంచిని రాజదానిగా చేసుకొని సుమారు ఐదు శతాబ్దాల కాలం రాజ్యమేలారు. వీరు సాహిత్యం, వాస్తు, శిల్పకళను గొప్పగా అభివృద్ధి చేశారు. వీరు ఘటికలు స్థాపించి సంస్కృతాన్ని వైదిక విద్యలను విశేషంగా పోషించారు. పల్లవ రాజైన మొదటి మహేంద్ర వర్మ గొప్ప కవి సంస్కృతంలో మత్తవిలాస ప్రహసనం అని నాటకాన్ని రాశాడు. నాటకంలో జైన, బౌద్ధ మతాలను కాపాలిక, కాలముఖ లాంటి శైవ శాఖలను విమర్శించాడు. వెలమ నాయక రాజుల్లో సర్వజ్ఞ సింగన చాల గొప్పవాడు ఇతడు స్వయంగా కవి పండితుడు, పోషకుడు సాహిత్య సృష్టిలో రెడ్డి రాజైన పెదకోమటి వేమారెడ్డికి దీటైనవాడు. కుమార (రెండవ) సింగమ నాయుడికి సర్వజ్ఞ సింగమ భూపాలుడు అనే పేరు కూడా కలదు. వీరికి కళ్యాణ భూపతి అనే బిరుదు కలదు. కుమార సింగమ నాయుడు “రసార్ణవ సుధాకరం” అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని, సారంగధరుని సంగీత రత్నాకరం పై “సంగీత సుధాకరం” అనే వ్యాఖ్యాన గ్రంధం, “రత్నపాంచాలిక” అనే నాటకాన్ని రచించారు. రత్నపాంచాలిక అనే నాటకానికి కువలయావలి అనే పేరుంది. ఇందులోని ఇతివత్తం శ్రీకృష్ణునితో కువలయావలికి వివాహం జరగడం. ఈ నాటకంలో కవి తనను తాను ‘లలిత కవితా విలాస చతురానామా’ అని వర్ణించుకున్నాడు. ఇంక ఇతనికి ప్రతిగండ భైరవ, ఖడ్గ నారాయణ అనే బిరుదులు ఉన్నట్లు ఈ నాటకం ద్వారా తెలుస్తుంది. ఈ రత్నపాంచాలిక నాటకాన్ని రాచకొండలో ప్రసన్న గోపాల దేవుని ఆలయం వద్ద జరిగే వసంతోత్సవాల సమయంలో ప్రదర్శించేవారు. వీరికి ‘లక్షలక్షణవేద’ ‘సర్వజ్ఞ చూడామణి’ అనే బిరుదులు కూడా కలవు. వీరు గోప్ప కవే కాక కవులను పండితులను పోషించాడు. ఇతని ఆస్థానంలో విశ్వేశ్వరుడు, బొమ్మకంటి అప్పయార్యుడు అనే కవులు ఉన్నారు. విశ్వేశ్వరుడు చమత్కార చంద్రిక, అనే అలంకార శాస్త్ర గ్రంధం, బొమ్మకంటి అప్పయార్యుడు అమర కోశానికి వ్యాఖ్యానం రాశారు. సింగమ భుపాలుని కుమారుడైన రావుమాధానాయుడు కూడా గోప్ప విద్వాంసుడు. ఇతడు శ్రీమద్రామాయణం పై ‘రాఘవీయం’ అనే వ్యాఖ్యానం రాశాడని మాధానాయుడి భార్య వేయించిన నాగారం శాసనం ద్వారా తెలుస్తోంది.
కాకతీయ వంశ పాలకుల్లో రుద్రదేవుడి కాలానికి ఒక ప్రత్యేకత, చారిత్రక ప్రాధాన్యత కలదు. వీరి పాలనా కాలాన్ని సామంత, స్వతంత్ర పాలక దశగా పేర్కొనవచ్చని వేయిస్తంభాల గుడి శాసనం తెలియజేస్తుంది. రుద్రదేవడు స్వయంగా కవి, సాహిత్యపోషకుడు విద్యావంతులకు కల్పతరువువంటి వాడని క్రీ. శ 1196 నాటి పిల్లలమర్రి నాయరెడ్డి శాసనం తెలియజేస్తుంది. ద్రాక్షారామ శాసనం రుద్రదేవుని ‘వినయభుషణుడని’ పేర్కొంది. బద్దెన రచించిన నీతి శాస్త్ర ముక్తావళిలోని ఒక పద్యం ప్రకారం నీతిశాస్త్ర రచయిత రుద్రదేవుడని తెలుస్తోంది. నీతిసారం కాకతి రుద్రదేవుని రచన ఇది రాజ్య నిర్వహణ వివరాలు తెలియజేస్తుంది. బద్దెన నీతిశాస్త్ర ముక్తావళి రచించారు. ఈ రచన కాకతీయ రాజ్య, రాజకీయ వ్యవస్థ స్వభావ, స్వరూపాలను వర్ణిస్తుంది. దీనిలో కోమట్ల ప్రాధాన్యతను ఈ విధంగా వివరించాడు. కోమటి నగరానికి ఊపిరివంటి వాడు. ధాన్యం పంటకు నీరు ఎలాగో ఏనుగుకు తొండం ఎలాగో, నగరానికి కోమటి అలాంటి వాడు. అయ్యవంశ పిన్నచొడుని కుమారుడైన జాయాపను గణపతిదేవుడు తన కొలువులో గజసాహినిగా నియమించి గౌరవించాడు. జాయాప సేనాని ‘గణపేశ్వరం ‘ శాసనం వేయించాడు. దీనిలో గణపతి దేవుని దక్షిణదేశ విజయాలు వివరించబడ్డాయి. జాయప గొప్ప సంస్కృత పండతుడు. నృత్త రత్నావళి అనే గ్రంధాన్ని రచించాడు. ఇది ఆనాడు ఆంధ్రదేశంలో వాడుకలో ఉన్న నాట్య నృత్య రీతులు తెలియజేస్తుంది. దీనిలో మొత్తం ఎనిమిది ప్రకరణాలు కలవు. నృత్య, నాట్య గురువులకు ప్రామాణిక గ్రంధమైనది. పాలంపేట రామప్పగుడి గోడలపై అణువణువునా చెక్కిన నృత్య భంగిమలు దీనినుండే స్వీకరించారు. జాయప సేనాని సంగీతంపై గీత రత్నావళి, వాద్య పరికరాలపై వాద్య రత్నావళి అనే గ్రంథాలను రచించాడని కొందరు పేర్కొన్నారు.కానీ ఇవి అందుబాటులో లేవు. కుతుబ్ షాహీ వంశ ప్రభువు ఇబ్రహీం కుతుబ్ షా తెలుగు కవులను ఆదరాభిమానాలతో పోషించుట కారణంగా మల్కిభరాముడు అనే బిరుదు పొందాడు. ఇతని కాలంలో ఉర్దూ భాష అభివృద్ధి చెందడం వలన ఇతన్ని ఉర్దూ చాజర్ (పితామహుడు) అంటారు వీరు అషీఖానాలో కవితా గోష్ఠి నిర్వహించేవారు. మహ్మద్ కులీ కుతుబ్ షా గొప్ప సాహిత్యాభిమాని దక్కనీ, ఉర్దూ భాషల్లో దిట్ట తెలుగు భాషలో కూడా మంచి పాండిత్యం కలవాడని కొందరు పండితులు పేర్కొన్నారు. వీరి కలం పేరు మాని వీరి కవిత్వాలు కులియత్ కులి అనే పుస్తకంలో సేకరించబడినవి.
దక్షిణ భారతదేశంలో 1336 లో విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర బుక్క రాయలు స్థాపించారు. ఈ విశాల సామ్రాజ్యాన్ని ఐదు రాజ వంశాలు పరిపాలించాయి. సంగమ వంశ పాలకులలో గొప్పవాడు రెండవ దేవరాయలు. వీరిని ఇమ్మడి దేవరాయలు, లేదా ప్రౌడ దేవరాయలు అని కూడా పిలుస్తారు. హిందూ పురాణాలలో ఖగోళ పాలకుడు ఇంద్రుడి అవతారమని సామాన్యులు విశ్వసించేవారు. శాసనాలలో గజబెటకార అని పేర్కొనబడింది. వీరు గోప్ప సాహిత్య పోషకులు. వీరి ఆస్థానాన్ని ముప్పై నలుగురు కవులు అలంకరించారని ప్రతీతి. స్వయంగా సంస్కృతంలో నిష్ణాతులు. సంస్కృతంలో మహానాటక సుధానిది, బదరాయణ బ్రహ్మ సూత్రాలకు వ్యాఖ్యానం రాశారు. తుళువ వంశ రాజులలో గొప్పవాడు శ్రీకృష్ణ దేవరాయలు. వీరి కాలంలో అష్టదిగ్గజ కవులు పోషింపబడ్డారు. వీరు తెలుగు సాహిత్యాన్ని సంస్కృత ప్రభావం నుంచి విముక్తి చేశాడు. తెలుగు సాహిత్యానికి వీరి కాలం స్వర్ణయుగంగా ప్రసిద్ధి గాంచింది. వీరిని ఆంధ్రభోజుడు అనే బిరుదుతో పిలుస్తారు. వీరు సంస్కృతంలో ” జాంబవతీ పరిణయం” తెలుగులో “ఆముక్త మాల్యద” అనే గ్రంధాలు రచించారు. దీనికే విష్ణుచిత్తీయం అని మరోపేరు కలదు. ఇది అముక్త మాల్యద అనేపేరున ఉన్న విష్ణుచిత్తుని కథ. విష్ణు చిత్తునితో ప్రారంభమై యమునాచార్యుడు, మాలదాసరి కథలను ఉపకథలుగా చెప్తూ గోదాదేవి కళ్యాణంతో అంతమయ్యే కథ.
గుప్తుల తరువాత ఉత్తర భారత దేశాన్ని పాలించిన రాజులలో గొప్పవాడు హర్షవర్ధనుడు. ఇతడు పుష్యభూతి వంశస్తుడు. రాజపుత్ర అను బిరుదుతో హర్షుడు స్థానేశ్వర సింహాసనం అధిష్టించాడు. ఉత్తర భారతదేశ చరిత్రలో చివరి హిందూ సామ్రాజ్య నిర్మాత అశోకుని వలె ప్రజా శ్రేయస్సుకు కృషి చేస్తూ బౌద్ధాన్ని ఆదరించాడు. రెండవ చంద్రగుప్తుని వలె కవిపోషకుడు. కవి పండితుల పోషణకు ప్రభుత్వ ఆదాయంలో నాల్గవ వంతు ఖర్చు చేశాడు. హర్షుడు సాహిత్య పోషకుడేగాక స్వయంగా సంస్కృతంలో గొప్ప కవి. ఇతడు సంస్కృతంలో నాగానందం, రత్నావళి, ప్రియదర్శిని అను గోప్ప నాటకాలు రచించాడు. సంస్కృతంలో గౌతమ బుద్దుని అవతారమని చెప్పబడే జీమూత వాహనుని కధను నాగానంద నాటకంగా రచించాడు.. గర్భవతి అయిన వాసవదత్త విమానంలో ఉదయనునితోను యౌగంధ రాయణుతోను కలసి విహారయాత్ర చేస్తూ ఉంటుంది. ఆమెకు అంతకుముందు తాను ఆకాశంలో ఎగురుతూ వుంటే విద్యాధర కన్యకలు వచ్చి గానం చేస్తూ తన్ను సేవిస్తున్నట్లు స్వప్నం వస్తుంది. అందుకని ఈవిద్యాధరులను గూర్చి వినగోరుతున్నానని ఆమె అడుగగా యౌగంధరాయణుడు అమ్మా! మీకు వచ్చింది దివ్య స్వప్నం. మీ గర్భాన విద్యాధరుడెవరో జన్మించబోతున్నాడు. విద్యాధరులంటే మహాత్ములు. ఉదాహరణకు మహాసత్వుడుగా, దానవీరుడిగా అయిన జీమూతవాహనుడనే విద్యాధరుని కధను చెబుతాను వినండి. అని ఆ కధ చెబుతాడు. దీనిని హర్షుడు తన నాగానంద నాటకవృత్తాంతంగా స్వీకరించాడు. రాజపుత్రులు సాహిత్య, కళా పోషకులు పరమార రాజులైన ముంజ, భోజ గొప్ప పండితులుగా సాహితీవేత్తలుగా పేరు గడించారు. భోజరాజు అనేక రచనలు చేశాడు. వానిలో ఆయుర్వేద సర్వస్వం, రాజమృగంక, వ్యవహార సముచ్చయం, శబ్దానుశాసనం, యుక్తికల్పతరువు, ముఖ్యమైనవి.
ఈ విధంగా పాలకులెందరో సాహిత్యం పట్ల మక్కువ పెంచుకొని ఎనలేని కృషి చేస్తూ ఎందరో కవులను ప్రోత్సహిస్తూ స్వయంగా గ్రంథ రచనకు పూనుకొని అపారమైన సాహిత్య సృష్టికి కృషి చేశారు. వారిని వారు సాహిత్యానికి చేసిన కృషిని సమాజం ఏనాటికీ మరువదు.
రచన
చింతరెడ్డి భాస్కర్ రెడ్డి,
మిర్యాలగూడ,
నల్లగొండ జిల్లా,
తెలంగాణ రాష్ట్రం.
9701295200.