అంశంగా పెచ్చులూడకు…!!!
గోడకు చెవులుండినా
మెడకు తాడులేని కోతి
కోతి కొమ్మచ్చిలాడేటి మనస్సు…
తలుపులుండని తన లోకంలో
ఊహలకు రెక్కలు కట్టుకొని తడారని
తర్ఫీదులతో విహంగమై తిరుగుతుంది…
వాన రాకడలు ఆగవు
ప్రాణం పోకడలు తెలియవు…
గెలుపోటములు జీవితాన మానసిక
అన్వయింపులే అయినా…
అనుసరించిన సమయాలతో
నీవొక ఉద్దేశంగా సాగిపో…
బతుకు చదరంగమని కదలలేక
అంశంగా పెచ్చులూడకు…
సంకేతాలేన్నో హృదయం ఒక్కటే
కూడు పెట్టని పూటకై ఆశించకు…
కోటి పోగులనల్లిన నీతివి నీవై
నీలోని వెర్రి ముఖాన్ని సంఘానికి చూపకు అన్వేషణలకు పిడికిలివై ఉత్సాహానికి
ఊపిరివై నిజాల ప్రత్యక్షత ముందర
మోకరిళ్ళు…
ప్రపంచం మిథ్యా కాదు…
దానికై ప్రయత్నాలు వృదాకారాదు
నిలిచిన ప్రకృతిలో దిక్కుల వెలుగును
పోగేసుకొంటు ఆలోచనల కూటమిలో
సంఘర్షణల సమ్మెట పోటులతో
మొనదేలుతు గుచ్చిన గమ్యం
ప్రగతికి దారులు తెరువాలని
ప్రయాణించు…
దేరంగుల భైరవ (కర్నూలు)
91006883969100688396